హోటల్ గది అద్దె తగ్గించడం కోసం మైనర్ బాలికలతో దారుణం.. అమెరికాలో భారతీయుడికి పదేళ్ల జైలు!

  • మైనర్‌పై లైంగిక దాడికి హ్యూమన్ ట్రాఫికర్లకు డబ్బు చెల్లించిన కవన్ కుమార్ పటేల్
  • గది అద్దె తగ్గించుకునేందుకు హోటల్ సిబ్బందితో బాలికలను బలవంతం చేసిన ముఠా
  • ఇదే కేసులో మరో ఇద్దరు భారత సంతతి ఉద్యోగులపైనా అభియోగాలు
  • శిక్ష పూర్తయ్యాక పటేల్‌ను దేశం నుంచి బహిష్కరించనున్న అధికారులు
అమెరికాలో దారుణమైన నేరానికి పాల్పడిన భారతీయ వ్యక్తికి అక్కడి కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. హ్యూమన్ ట్రాఫికర్లకు డబ్బు చెల్లించి, మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 27 ఏళ్ల కవన్ కుమార్ పటేల్‌ను దోషిగా నిర్ధారించింది. గుజరాత్‌కు చెందిన పటేల్, నెబ్రాస్కా రాష్ట్రంలోని ఒమాహాలో గల ఒక హోటల్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 

కేసు నేపథ్యం ఏమిటంటే..!
2025 జనవరి 6న ఒమాహాలోని అమెరిక్‌ఇన్ (AmericInn) హోటల్‌లో ఒక దొంగతనం కేసుపై విచారణకు వెళ్లిన పోలీసులకు సెక్స్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్లు కీలక ఆధారాలు లభించాయి. దీంతో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్, ఒమాహా పోలీస్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. ఈ క్రమంలో వాణిజ్యపరమైన లైంగిక కార్యకలాపాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన 15, 16 ఏళ్ల ఇద్దరు మైనర్ బాలికలను అధికారులు రక్షించారు.

విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. "హోటల్ గది అద్దె తగ్గించుకోవాలంటే సిబ్బందితో లైంగికంగా కలవాలని, లేకపోతే హోటల్ నుంచి గెంటేస్తామని ట్రాఫికర్లు తమను బెదిరించారు" అని బాధితులు అధికారులకు తెలిపారు. ఈ క్రమంలోనే హోటల్ ఉద్యోగి అయిన కవన్ కుమార్ పటేల్, మైనర్ బాలికతో లైంగిక దాడి జరిపేందుకు ట్రాఫికర్లకు హోటల్ డ్రాయర్‌లోని డబ్బును చెల్లించినట్లు అంగీకరించాడు. పటేల్‌తో పాటు మరో ఇద్దరు హోటల్ ఉద్యోగులు కూడా ఈ దారుణానికి పాల్పడినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఈ నేరానికి పాల్పడిన ట్రాఫికర్లు ఎడ్వర్డో జోస్ పెర్డోమో, మిచెల్ మార్టినెజ్-గొంజాలెజ్, అల్ఫ్రెడో జంబ్రానో-హర్టాడోలతో పాటు పటేల్ సహోద్యోగులైన సుమిత్ చౌధరి, విశాల్ గోస్వామి అనే మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులపై కూడా అభియోగాలు మోపారు. కనీసం ఆహారం కూడా లేకుండా ఆ బాలికలను రోజుల తరబడి హోటల్‌లోనే బంధించి, ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇచ్చి విటులను ఏర్పాటు చేసేవారని దర్యాప్తులో తేలింది.

"నరక కూపం లాంటి పరిస్థితుల నుంచి ఆ చిన్నారులను హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్ రక్షించింది" అని యునైటెడ్ స్టేట్స్ అటార్నీ లెస్లీ వుడ్స్ తెలిపారు. అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న పటేల్ ను తన జైలు శిక్షను పూర్తి చేసిన తర్వాత దేశం నుంచి బహిష్కరించనున్నట్లు అధికారులు వెల్ల‌డించారు.

Kavan Kumar Patel
human trafficking
sex trafficking
minor girls
hotel employee
Omaha Nebraska
Gujarat
AmericInn hotel
Sumit Choudhary
Vishal Goswami

More Telugu News